ధోనీ వరల్డ్ కప్ సిక్స్‌కు స్పెషల్ గుర్తింపు.. స్టేడియంలో స్మారక చిహ్నం.. మహీకి సత్కారం - 2011 టీమిండియా కెప్టెన్
మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో భారత జట్టు 2011 ప్రపంచ కప్ గెలుపొందింది. ఈ ప్రపంచ కప్ విజయానికి గుర్తుగా ముంబయి క్రికెట్ అసోసియేషన్ స్మారక చిహ్నాన్ని నిర్మించనుంది. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. అయితే ఆ సమయంలో.. ఎక్కడైతే బంతి పడిందో ఆ ప్రదేశంలో స్మారక చిహ్నాన్ని నిర్మించనున్నట్లు ఎస్సీఏ తెలిపింది. దీని కోసం ముంబయి క్రికెట్ అసోసియేషన్ పెవిలియన్ స్టాండ్‌లోని జే282 నుంచి జే286 వరకు ఉన్న 5 కుర్చీలు తీసేసి అక్కడ స్మారక చిహ్నాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం వాంఖడే స్టేడియంలో ఎంఎస్ ధోనీని ముంబయి క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు మిస్టర్ కూల్ ధోనీ.. కులశేఖర బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 28 ఏళ్ల తర్వాత భారత్‌కు ప్రపంచ కప్పు అందించాడు. దీంతో సొంత గడ్డపై ప్రపంచ కప్‌ను ముద్దాడిన తొలి దేశంగా భారత్ చరిత్రలో నిలిచింది.