MP Dharmapuri Arvind on Medical Colleges Inauguration : 'ప్రభుత్వం ప్రారంభించిన 9 మెడికల్ కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వానిది నయా పైసా లేదు' - తెలంగాణ రాజకీయాలు
Published : Sep 15, 2023, 9:38 PM IST
MP Dharmapuri Arvind on Medical Colleges Inauguration : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రారంభించిన 9 మెడికల్ కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వానిది నయా పైసా లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. మెడికల్ కళాశాలల నిర్మాణం కోసం కేంద్రం నుంచి పూర్తి సహాయం అందిందన్నారు. ఇంకా పనులు పూర్తి చేయక ముందే ప్రారంభించారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయనే ఆదర-బాదరగా కేసీఆర్ ప్రారంభించారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన గ్రాంట్స్తో తొమ్మిది వైద్య కాలేజీలు ప్రారంభించారని చెప్పారు.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మోదీ తీసుకున్న పాలసీ వల్ల వైద్యుల సంఖ్య రెండింతలు పెరిగిందని తెలిపారు. కేసీఆర్ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని.. రాష్ట్రాన్ని బిక్షమెత్తుకునేలా తయారు చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో ప్రొఫెసర్లు, సిబ్బందిపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేవని, రోగులను ఎలుకలు కొరుకుతున్నాయని పిల్లలను ఎత్తుకుపోతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం మెడికల్ కళాశాలలకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారని.. కేంద్రం అనుమతి ఇవ్వకపోతే తొమ్మిది మెడికల్ కళాశాలలు ఎలా ప్రారంభించారని నిలదీశారు.