Motkupalli on Chandrababu Arrest : సీఎం జగన్ పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గరపడింది : మోత్కుపల్లి - బాబు అరెస్ట్‌కు నిరసనగా మోత్కుపల్లి నిరాహార దీక్ష
Published : Oct 23, 2023, 3:03 PM IST
Motkupalli on Chandrababu Arrest:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దుర్మార్గమైన పాలనను ప్రజలు అంతమొందించే రోజులు దగ్గరపడ్డాయని తెలంగాణ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వచ్చే ఎన్నికల్లో పేద ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ బేగంపేటలోని తన నివాసంలో మోత్కుపల్లి ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టారు. చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారని.. ఈ పరిస్థితుల్లో తాను దసరా పండుగను బహిష్కరించి దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
జైల్లో ఉండాల్సింది కిరాతకులని.. ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన వాళ్లు కాదని మోత్కుపల్లి మండిపడ్డారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్టు విషయంలో సీఎం కేసీఆర్ నోరు విప్పకపోవడం చూస్తుంటే జగన్‌రెడ్డి ఆడుతున్న నాటకంలో తాను కూడా ఉన్నట్లున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ విషయంలో కేసీఆర్ నోరుమెదకపోతే తెలంగాణలో 30 సీట్లు కోల్పోవాల్సి వస్తుందని మోత్కుపల్లి హెచ్చరించారు.