Viral Video : మార్నింగ్ వాక్‌కు వెళ్లిన వారిపైకి దూసుకొచ్చిన కారు.. ఒళ్లు గగుర్పొడిచేలా వీడియో.. - కారు ప్రమాదంలో తల్లి కూతురు మృతి
Bandlagudajagir Car Accidnt Video : మృత్యువు ఏ రూపంలో దూసుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇందుకు నిదర్శనమే ఈ వీడియో. ఉదయంపూట మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన ముగ్గురి విషయంలో కూడా మృత్యువు కారు రూపంలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వారు తేరుకునేలోపే అంతా అయిపోయి.. అందులో తల్లీకుమార్తె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో మహిళకు తీవ్రగాయాలై.. ఆసుపత్రి పాలైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు వేగాన్ని అదుపు చేయలేని వ్యక్తి.. మార్నింగ్ వాకింగ్ చేస్తున్న ముగ్గురిని బలంగా ఢీకొట్టాడు. దాని వేగానికి ఆ ముగ్గురూ పిట్టల్లా ఎగిరిపడ్డారు. రెప్పపాటు క్షణంలో ఈ ప్రమాదం జరిగిపోయింది. ఆ తర్వాత కారు పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి సైతం గాయాలయ్యాయి. చుట్టు పక్కల వాళ్లు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.