More Cases on Chandrababu Naidu: చంద్రబాబుపై కేసుల పరంపర.. ఫైబర్‌నెట్ కేసులో ఏ25గా చేర్చిన సీఐడీ - Chandrababu cases news
Published : Sep 20, 2023, 10:32 AM IST
More Cases on Chandrababu Naidu :ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యల పరంపరను సీఎం జగన్ ప్రభుత్వం మరింత తీవ్ర తరం చేసింది. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల కేసులో ఇప్పటికే అక్రమంగా అరెస్టు చేసి వేధిస్తున్న జగన్ ప్రభుత్వం.. తాజాగా మరో కేసును ఆయన మెడకు చుట్టింది. ఏపీ ఫైబర్‌నెట్ తొలి దశ టెండర్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై 2021 సెప్టెంబరులో నమోదు చేసిన కేసులో చంద్రబాబును 25వ నిందితుడిగా (Chandrababu as A25 in Fibernet Case) ఏపీ సీఐడీ చేర్చింది. ఈ వివరాలతో విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ అధికారులు మంగళవారం మెమో సమర్పించారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబును ఈ కేసులో విచారించేందుకు అనుమతివ్వాలని కోరుతూ ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్ పిటిషన్‌నూ దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కేసులోనూ ఇప్పటికే పీటీ వారంట్ దాఖలు చేశారు. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా అక్రమ కేసులన్నింటినీ తెర పైకి తీసుకు వచ్చి, వాటిలో చంద్రబాబును ఇరికించాలనే కుట్ర ఉన్నట్లు టీడీపీ ఆరోపిస్తోంది.