Moranchapalli Floods : భూపాలపల్లి మండలం మొరంచపల్లిలో సహాయక చర్యలు చేపట్టిన బీఆర్‌ఎస్ నాయకులు - తెలంగాణ తాజా వార్తలు
Warangal Floods Today : ఉమ్మడి వరంగల్ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా.. ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఇంకా వరద గుప్పిట్లోనే ప్రజలు విలవిలలాడుతున్నారు. వారిని రక్షించేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆహారాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. ఏటూరు నాగారం ప్రాంతంలోని కొండాయిలో.. భద్రాచలం ప్రాంతాల్లో అవస్థలు పడుతున్న వారికోసం వరంగల్ మామునూరు నుంచి హెలికాప్టర్ ద్వారా ఆహార పొట్లాలను పంపిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. హెలికాప్టర్‌లో ఆహార పొట్లాలు, నీరు, మందులను తీసుకువెళ్లారు. భద్రాచలం ప్రాంతంలో వరదల్లో చిక్కుకుని ఆందోళన చెందుతున్న బాధితుల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను, రెస్క్యూ టీంలను హెలికాప్టర్‌లో పంపించారు. విపత్తు వేళ ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు. మరోవైపు మొరంచపల్లి వరద బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే గండ్ర దంపతులు పరామర్శించారు. చెల్పూరు నుంచి మొరంచపల్లి వరకు కాలినడకన చేరుకున్న ఎమ్మెల్యే దంపతులను చూసిన గ్రామ ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. వర్షానికి తెగిపోయిన రోడ్డు మరమ్మత్తు పనులు త్వరితగతిన చేయాలని పోలీసులను ఆదేశించారు.