మందుబాబుకు షాకిచ్చిన కోతి.. సీసా లాక్కుని.. ఫుల్గా తాగి..
సాధారణంగా మనుషులు మద్యం తాగుతారు. కానీ, కోతి మద్యం సేవించడం ఎప్పుడైనా చూశారా? ఉత్తర్ప్రదేశ్ బాందా జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. వానరం.. ఓ తాగుబోతు నుంచి మద్యం సీసా లాక్కుని.. తాగేసింది. కోతి మద్యం తాగుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మతౌండ్ పట్టణంలోని బస్టాండ్ పరిసరాల్లో ఓ వానరం.. అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేసింది. అనంతరం మద్యం సీసాతో పట్టుకుని కూర్చున్న తాగుబోతును చూసింది. అనంతం అతడి దగ్గర నుంచి ఆ మద్యం సీసాను లాక్కుంది. ఒక్క చుక్క కూడా కింద పడకుండా మద్యం సీసా మూతను తీసింది. ఆ తర్వాత మద్యాన్ని ఆస్వాదిస్తూ తాగింది. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారి సంజయ్.. ఆ కోతిని పట్టుకుని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో ఆ వానరాన్ని అడవిలో వదిలేస్తామని చెప్పారు. కాగా, ఈ ఘటనలో ఆ కోతి తప్పేమి లేదని.. అది అలా మద్యానికి బానిసవ్వడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంజయ్ తెలిపారు.