Modi Birthday Wishes : 'మోదీకి ప్రేమతో'.. నవధాన్యాలతో ప్రధాని చిత్రం.. బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్స్! - మోదీ సైకత శిల్పం
Published : Sep 16, 2023, 8:05 PM IST
Modi Birthday Wishes :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 72వ పుట్టిన రోజు నేపథ్యంలో వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమయ్యారు అభిమానులు. మహారాష్ట్ర పుణెకు చెందిన ఓ కళాకారుల బృందం రూపొందించిన చిత్రం ఔరా అనిపిస్తోంది. వివిధ రకాల పప్పు, ధాన్యం గింజలను ఉపయోగించి మోదీ చిత్రాన్ని గణేశ్ ఖరే అనే కళాకారుడి బృందం అద్భుతంగా తీర్చిదిద్దింది. ఈ చిత్రాన్ని నేలపై పరచేందుకు.. కళాకారులకు రెండు రోజులు పట్టింది. గోధుమలు, నువ్వులు, జొన్న, హలీవ్, మూంగ్, మత్కీ వంటి 60కిలోల పప్పులు, ధాన్యపు దినుసులతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రధాని మోదీ తన 9 ఏళ్ల పాలనలో రైతుల కోసం చాలా చేశారనీ అందుకే ఆయన పుట్టిన రోజును ఇలా జరుపుకుంటున్నామని గణేశ్ ఖరే చెప్పారు. వీరితోపాటు గుజరాత్ గాంధీనగర్‌కు చెందిన ఎమ్మెల్యే సైతం వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. రాజధానిలో ప్రధానమంత్రి సైకత శిల్పాన్ని తయారు చేయించారు మండ్వీ ఎమ్మెల్యే అనిరుధ్ దవే. దీనికోసం 150 టన్నుల ఇసుకను పఠాన్ నుంచి తెప్పించారు. మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ జన్మదినాన్ని వారం రోజుల పాటు చేయనున్నారు.