Phone Explosion : డ్రైవింగ్ చేస్తుండగా సెల్‌ఫోన్ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు - phone explosion news
Phone Explosion while in driving in Warangal district : ప్రస్తుత కాలంలో మొబైల్ లేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. మన అవసరాల కోసం తెచ్చుకున్న వస్తువుల వల్లనే నేటి కాలంలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. స్కూటీ పేలుళ్లు, ఫోన్ పేలుళ్లు అనేవి ఈ మధ్యకాలంలో అధికంగా జరుగుతున్నాయి. ఛార్జింగ్ పెట్టినప్పుడు, చేతిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అకస్మాత్తుగా ఫోన్లు పేలుతున్నాయి. మొబైల్ ఫోన్ల వల్ల ఏ విధంగా ప్రమాదం పొంచి వస్తుందో ఊహించడం కష్టమవుతోంది.. చూస్తుండగానే దగ్దమైపోతున్నాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి కొన్ని సార్లు తప్పించుకున్నా.. మరికొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో జరిగింది. వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడుతుండగా ఆకస్మాత్తుగా చరవాణి పేలి తీవ్ర గాయాలపాలయ్యాడు ఓ వ్యక్తి.
వరంగల్ జిల్లాలో చరవాణి పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో మొబైల్ పేలిపోయింది. ఈ ఘటన పర్వతగిరి మండలం అనంతారం ఎక్స్ రోడ్ వద్ద జరిగింది. సాధ్య తండాకు చెందిన గుగులోతు రవి తన డోజర్ ట్రాక్టర్ బండిని రిపేర్ చేయించేందుకు వరంగల్‌కు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో అనంతారం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ఒక్కసారిగా చరవాణి పేలింది. దీంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ రవి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.