MLC Kavitha Bathukamma Video : బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత.. తోటి మహిళలతో కలిసి ఆటాపాట - జగిత్యాల బతుకమ్మ వేడుకలు
Published : Oct 17, 2023, 10:54 PM IST
MLC Kavitha Bathukamma Video :రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆటపాటల సందడి నడుమ.. బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడపడుచులంతా పాదం కదుపుతున్నారు. ఈ క్రమంలో జగిత్యాల మినీ స్టేడియంలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొని.. తోటి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తీరొక్క పూలతో తీర్చిదిద్దిన భారీ ఎత్తైన బతుకమ్మ.. వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై గౌరమ్మ పాటలు పాడుతూ.. బతుకమ్మ ఆడారు. కవితతో స్వీయచిత్రాలు తీసుకోవడానికి మహిళలు పోటీ పడ్డారు.
ఎంగిళిపూలతో మొదలై.. సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు సాగే ఈ అపురూప వేడుక తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ఉట్టిపడేలా చేస్తుంది. సంస్కృతిని మరచిపోయే సమాజం బాగుండదని.. మన పండుగలను ముందు తరాలకు తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో జగిత్యాల జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.