Jeevan Reddy Fires on BRS Govt : 'రైస్‌మిల్లర్ల చెప్పుచేతుల్లో ధాన్యం సేకరణ' - రైస్మిల్లర్లపై జీవన్‌రెడ్డి మండిపాటు
MLC Jeevanreddy Fires on BRS Govt : రైస్‌మిల్లర్ల చెప్పుచేతుల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండటంతో రైతులు నిలువునా మోసాలకు గురవుతున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. మిల్లర్లను అదుపుచేయలేకపోవటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ తూకానికి అనుగుణంగా రైతులకు చెల్లింపులు జరగటం లేదన్న జీవన్‌రెడ్డి.... ట్రక్‌షీట్లను పరిగణిస్తూ దగా చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం తూకం వేసి 4రోజులైనా లారీలు రావని... వచ్చినా మరో 4రోజుల దాకా అన్‌లోడ్ చేయటం లేదని మండిపడ్డారు.
కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులే రైతులపై కేసీఆర్ సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి క్వింటాల్ ధాన్యం మీద 5కిలోలు దోపిడి చేస్తున్నారన్న ఆయన... ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జి తూకానికి అనుగుణంగా రశీదు ఇవ్వటం లేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకి ఉన్న అన్ని రాయితీలు ఎత్తేసి కేవలం రైతు బంధు మాత్రమే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే రోహిణి కార్తె వచ్చినందున నెలాఖరులోగా కొనుగోళ్లు పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లని అదుపు చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతగా ఆరోపించారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు రొడ్డేక్కుతున్నారన్న జీవన్‌రెడ్డి... ప్రభుత్వంపై నమ్మకం లేకనే రైతులే మిల్లర్లతో మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు.