ప్రోటోకాల్ వివాదం - స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్న సునీత లక్ష్మారెడ్డి - మెదక్ తాజా వార్తలు
Published : Dec 10, 2023, 5:35 PM IST
MLA Sunitha Laxma Reddy Protocol Issue : మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ విషయంలో రసాభాస జరిగింది. శనివారం మహాలక్ష్మి కార్యక్రమ ప్రారంభానికి తనను ఆహ్వానించ లేదని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే సునీత రెడ్డి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ఎందుకు పాటించడంలేదని, ప్రోటోకాల్ మార్చారా అంటూ అదనపు కలెక్టర్‌ను ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నిలదీశారు. ఎమ్మెల్యే తీరును కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య పరస్పర వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ, మహాలక్ష్మీ ప్రభుత్వ పథకం ప్రారంభానికి తనను ఎందుకు పిలవలేదన్నారు. ఇవాళ జరిగిన కార్యక్రమానికి పిలిచినా, అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మార్చి ప్రోటోకాల్ పాటించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై శాసనసభలో స్పీకర్‌కు ప్రోటోకాల్ వయోలెన్స్ కింద ఫిర్యాదు చేస్తానన్నారు.