'అవినీతి కోరల్లో చిక్కుకున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గద్దె దించటం ఖాయం' - ములుగు పొలిటికల్ న్యూస్
Published : Nov 11, 2023, 5:35 PM IST
MLA Seethakka Door to Door Election Campaign : ములుగు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థి.. ఎమ్మెల్యే సీతక్క ఇంటింటి ప్రచారం చేపడుతూ.. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామచంద్రపురం, భూపాల్ నగర్, నిమ్మ నగర్, ముద్దునూరు తండా, వెంకటేశ్వర్ల పల్లి తదితర గ్రామాలల్లో పర్యటించి ప్రజలందరూ కాంగ్రెస్కు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సీతక్క.. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు లేక యువత.. సరైన సమయంలో జీతాలు రాక ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారని ఆక్షేపించారు. ధరణి పోర్టల్ పెట్టి రైతులను ఎంతో ఆగమాగం చేశారన్నారు.
నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్లు ఇస్తానని నమ్మించి నట్టేటా ముంచారని.. కేసీఆర్ ప్రభుత్వంలో పేదలు మరింత దిగువస్థాయికి పడిపోయారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి కోరల్లో చిక్కుకున్న బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు గద్దె దించుతారని అన్నారు. బీఆర్ఎస్, ఇతర పార్టీల వారు డబ్బులతో పాటు మరి ఏదైనా ఇస్తే తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజల్ని కోరారు.