Police Complaint on CM KCR : సీఎం కేసీఆర్‌పై పోలీస్స్టేషన్లో కేసు పెట్టిన ఎమ్మెల్యే.. ఎందుకంటే..? - పొదెం వీరయ్య తాజా వార్తలు
MLA Podem Veeraiah Filed Police Complaint on CM KCR : సీఎం కేసీఆర్‌పై భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని ప్రజలకు, శ్రీ సీతారామచంద్ర స్వామికి ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చట్లేదని ఆరోపించారు. 2014వ సంవత్సరంలో మొదటిసారి స్వామి కల్యాణానికి సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు రూ.100 కోట్లతో ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రెండోసారి 2022వ సంవత్సరంలో వరదల సమయంలో రూ.1000 కోట్లు కేటాయించి వరద బాధితులకు పక్కా ఇళ్ల నిర్మాణాలు, కరకట్ట ఎత్తు పొడిగింపు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి వెళ్లారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు రూ.100 కూడా ఇవ్వకుండా ఇటు ప్రజలను, అటు స్వామివారిని సైతం మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని హామీ ఇచ్చిన సీఎం.. మాటలు తప్ప చేసిన అభివృద్ది శూన్యమని దుయ్యబట్టారు. హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వీరయ్య స్పష్టం చేశారు.