Jogu Ramanna Challenges Revanth Reddy : 'కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నేను ఉరేసుకుంటా' - రేవంత్‌రెడ్డికి జోగు రామన్న సవాల్
MLA Jogu Ramanna VS Revanth Reddy : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీ యవేడి రాజుకుంటోంది. అధికార, ప్రతిపక్షాలు తమ అస్త్రాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం మాదంటే.. మాదంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారీ గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నామంటూ బీఆర్‌ఎస్ చెబుతుండగా.. కర్ణాటక ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ కాబోతున్నాయంటూ కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణను పాలించే అర్హత కేసీఆర్‌కు లేదంటూ ఇటీవల రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న రేవంత్.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే తాను ఉరేసుకుంటానని సవాల్ చేశారు. రేవంత్‌కు దమ్ముంటే.. తన ఛాలెంజ్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై రేవంత్ తరచూ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని.. తీరు మార్చుకోవాలని హితవు పలికారు.