MLA Followers Attack on Lawyer : న్యాయవాదిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి..! - MLA Followers Attacked on Lawyer yughandar
MLA Followers Attack on Lawyer : ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు తనపై స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరులు దాడి చేశారంటూ న్యాయవాది యుగంధర్ పేర్కొన్నారు. తనపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచారని అన్నారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అఖిలపక్షం సమావేశానికి పోయివచ్చిన క్రమంలో తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి వద్ద తన కారుకు వాహనాలు అడ్డం పెట్టి.. కారు అద్దాలు పగులకొట్టి తనను బయటకు ఈడ్చి ఇనుప సీకులతో, కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. చనిపోయాననుకుని వదిలి వెళ్లారన్నారు.
న్యాయవాది యుగంధర్ ప్రస్తుతం మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని అక్రమాలను తాను అడుగడుగునా ప్రశ్నిస్తున్నందుకు తనపై దాడి జరిగిందని యుగంధర్ పేర్కొన్నారు. ఇంకోసారి ఎమ్మెల్యే గాదరి కిషోర్ పేరు ఎత్తితే.. ఇంటికి వచ్చి చంపుతామంటూ అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని.. తెలంగాణ ప్రభుత్వం స్పందించి.. తనకు రక్షణ కల్పించాలని కోరారు.