రామ మందిరం అంశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌గా మార్చారు : ఉత్తమ్ కుమార్ రెడ్డి - మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Published : Jan 13, 2024, 10:37 PM IST
Minister Uttam Kumar Reddy on Ram Mandir Inauguration : కాంగ్రెస్ నాయకులు రామ మందిరం కన్నా బాబ్రీ మసీదు కట్టడానికి ముందుకు వస్తారన్న బండీ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా రామ భక్తులమేనని, రామ మందిరం అంశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌గా మారుస్తున్నారని విమర్శించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారిగా సూర్యాపేటలో పర్యటించారు.
మంత్రికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపడుతుందని తాను వేసిన అంచనా నిజమైందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లాంటి వారు ఎవరు బరిలోకి దిగినా రాష్ట్రంలో 13-14 స్థానాల్లో సునాయాసంగా గెలుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం మరింతగా బలపడుతుందన్న మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ అహంకారాన్ని ప్రజలు సరిగ్గా పసిగట్టి ఓడించారని మంత్రి పేర్కొన్నారు.