మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల - మూడు ఫైళ్లపై సంతకం
Published : Dec 15, 2023, 5:35 PM IST
|Updated : Dec 15, 2023, 6:21 PM IST
Minister Tummala Nageswara Rao Take Responsibility : రాష్ట్ర నూతన వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పూజలు చేసి వేదపండితుల మధ్య బాధ్యతలు స్వీకరించిన ఆయన మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. సుమారు రూ.1,050 కోట్లతో రాష్ట్రంలో అయిదు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌ను తుమ్మల నాగేశ్వరరావు ఆమోదించారు.
రాష్ట్రంలోని 117 రైతు వేదికల్లో రూ.4కోట్ల 7 లక్షలతో దశల వారీగా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేసే మరో ఫైల్‌పై మంత్రి సంతకం చేశారు. సహకారశాఖ పరిధిలోని రాష్ట్ర, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల కంప్యూటరీకరణ చేసేందుకు మరో ఫైల్‌ను ఆమోదించారు. తుమ్మల నాగేశ్వరరావు పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, ఉద్యానవన శాఖ కమిషనర్ హనుమంత రావు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.