పంట ఉత్పత్తి, మార్కెటింగ్‌ని పెంచేందుకు కృషి చేయాలి - తుమ్మల
Published : Dec 11, 2023, 4:07 PM IST
Minister Thummala review on Agriculture Department :రైతు బాగుపడితేనే అన్ని రంగాలు బాగుపడతాయని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారిగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని రకాల పంటలకు తెలంగాణ నేల అనుకూలంగా ఉంటుందని, దేశంలో ఏ రాష్ట్రానికి ఈ ప్రత్యేకత లేదని పేర్కొన్నారు.
అధికారులంతా శాఖాపరంగా ఉన్న లోపాలను సవరించుకొని, సాంకేతిక పరిజ్ఞానంతో అధిక పంట దిగుబడిని సాధిస్తూ ఉత్పత్తిని, మార్కెటింగ్‌ని పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. తన వృత్తి వ్యవసాయమని అదే శాఖను ముఖ్యమంత్రి తనకు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు లాభసాటి కొత్త పంటలు పరిచయం చేసి వారిని సాగుకు ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తరకం పంటలను రైతులకు పరిచయం చేయాలని వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి, ఆ పంటలు పండిచేందుకు వాళ్లను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మామిడి, జామ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఆ పంటల సాగుకు సహాయపడాలని పేర్కొన్నారు. పామాయిల్ పంట సాగు చేసే రైతులు మంచి దిగుబడి సాధిస్తున్నారని మంచి గిట్టుబాటు ధర లభిస్తోందని అందువల్ల పామాయిల్ సాగును మరింతగా ప్రోత్సహించి అందులో అంతర పంటగా పుచ్చకాయలు పండించేలా ప్రోత్సహించాలని మంత్రి వివరించారు.