Minister Srinivas Goud fires on Revanth Reddy : " రేవంత్‌రెడ్డి బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు: శ్రీనివాస్‌గౌడ్" - Telangana latest political news
Srinivas Goud Angry over Revanth Reddy on BC Leaders : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. బీసీలు ఎదుగుతుంటే ఓర్వేలేకపోతున్నారని, బీసీ మంత్రులపై కోవర్ట్ ఆపరేషన్ చేయిస్తున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులను ఆనాడు వెన్నుపోటు పొడిచారన్న శ్రీనివాస్ గౌడ్.. పాపన్నను అవమానించారని అన్నారు. నిన్న, ఇవాళ కూడ బీసీల మీద అనేక అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారన్న మంత్రి.. బీసీలు ఎదుగుతుంటే ఓర్చుకోలేక పోతున్నారని ఆక్షేపించారు.
ప్రతిపక్ష పార్టీలు బీసీల అణచివేతకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. బీసీ బిడ్డలు గొప్పగా బతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తోంటే.. బీసీ మంత్రుల మీద ఓ ప్రతిపక్ష నేత కోవర్ట్ ఆపరేషన్ చేయిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఓడిపోయిన ఆయన ఇప్పుడు మళ్లీ గెలుస్తాడో లేదో కానీ.. పోలీసులను ఏదో చేస్తా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆక్షేపించారు. తమ సమాజాన్ని, తమ కులాలను అవమానపరచిన వ్యక్తులను.. బీసీలు తరిమి కొడతారని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తులు వస్తే ఆగం అవుతామన్న ఆలోచనతో బడుగు, బలహీన వర్గాల ప్రజలు, బీసీ మేధావులు, ప్రొఫెసర్లు, ఇతర వర్గాల ప్రజలు ఆలోచన చేస్తున్నారని అన్నారు.