భక్తులు ఆందోళన చెందొద్దు - మేడారం మహా జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం : మంత్రి సీతక్క - తెలంగాణలో మేడారం జాతర ఏర్పాట్లు
Published : Dec 17, 2023, 9:37 PM IST
Minister Seethakka Review on Medaram Jatara Celebration : మేడారం మహా జాతరను వైభవంగా నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పనులు నాణ్యంగా, వేగంగా జరిగేలా ప్రణాళికలు రూపొందించుకుని కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి కారణంగా నిధుల విడుదల జాప్యం జరిగిందని, తమ ప్రభుత్వం కొలువుదీరగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.75 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారని ఆమె చెప్పారు.
మహా జాతర ఏర్పాట్లకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులతో మేడారంలో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. పనులు కావట్లేదన్న ఆందోళన భక్తులకు అవసరం లేదని, జాతర సమయంలోగానే పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్రం జాతీయ పండుగ గుర్తింపు హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా ములుగు జిల్లాకు వచ్చిన సీతక్కకు నేతలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతక్క మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.