Satyavathy Rathore on flood victims : "ముంపు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం" - Floods in Kondai village
Satyavathy Rathore on flood victims in Mulugu : భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా ములుగు జిల్లాలో 70 సెం మీల వర్షపాతం నమోదైందని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. వచ్చే కేబినేట్ సమావేశంలో ముంపు గ్రామాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు. నీటమునిగిన మేడారం, నార్లాపూర్, ఉరటం, కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలకు చెందిన 5,450 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. వరదల్లో గల్లంతైన 16 మందిలో 13 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని.. ఇంకో ముగ్గురి కోసం రెస్క్యూటీంలు గాలిస్తున్నాయన్నారు. వరదల్లో కొట్టుకుపోయిన రోడ్లను పునర్నిర్మించి.. గ్రామాల మధ్య రాకపోకలను పునరుద్ధరిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన 58 గ్రామాలలో.. 40 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని.. సమస్యాత్మకంగా ఉన్న 18 గ్రామాలకు కరెంట్ సరఫరా చేయడానికి సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ముంపు ప్రజలకు పది రోజులకు సరిపడా నిత్యావసర సామాగ్రి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.