Minister Satyavathi Visited Mulugu : 'వరద ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాం' - ములుగు భారీ వర్షాలు
Satyavathi Rathod Inspected Flood Effected Areas in Mulugu : ములుగు జిల్లాలో భారీ వర్షాలకు ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు గుర్తించామని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్పష్టం చేశారు. వరద ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో జంపన్న వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. ఫలితంగా కొండాయి, దొడ్ల, మల్యాల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని తెలిపారు. జిల్లాలోని వరద పరిస్థితులను ఎంపీ మాలోత్ కవిత, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి పర్యవేక్షించారు. వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, ఔషధాలు అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రాణనష్టం జరగకుండా చూస్తున్నామని.. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని భరోసానిచ్చారు. తక్షణ చర్యలకు ఖర్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ ఖాతాలో రూ.కోటి జమ చేశారని అన్నారు. వాతావరణ హెచ్చరికలు, వరద ప్రవాహం దృష్ట్యా ప్రజలు అనవసరంగా బయటికి రావొద్దని మంత్రి కోరారు. ఏదైనా సహాయం కోసం 100కు డయల్ చేయాలన్నారు.