Minister Puvvada on Tummala Party Change : పిలిచి మరీ మంత్రిని చేస్తే.. ఇప్పుడేమో పక్క చూపులు చూస్తున్నారు: మంత్రి పువ్వాడ - రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
Published : Sep 3, 2023, 9:09 PM IST
Minister Puvvada on Tummala Party Change :తనమీద ఓడిపోయినా.. పిలిచి మరీ ఎమ్మెల్సీ ఇచ్చి కేసీఆర్ మంత్రిని చేశారని.. ఏం తక్కువ చేశారని ఈరోజు కడుపు నొప్పి వచ్చిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో మాజీ మంత్రి తుమ్మల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో మంత్రి అజయ్‌కుమార్ పలు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నెహ్రూనగర్ వాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
ఎప్పుడూ వాళ్లే పదవులు అనుభవించాలా? యువకులు రాజకీయాల్లోకి రావద్దా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రెండో తరాన్ని తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. మొదటి సారి ఖమ్మం జిల్లాకు మంత్రి పదవి లభించిందన్నారు. నాలుగేళ్ల కాలంలో ఖమ్మం ఎంతో అభివృద్ధి చెందిందని వివరించారు. తాను ఖమ్మం భూమిపుత్రుడనని చెప్పుకున్నారు. గెలిచినా.. ఓడినా.. ఖమ్మంలో ఉంటాను తప్ప.. పక్క చూపులు చూడనన్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటానని.. తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు లాాగే ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనంలో తన తండ్రి నాగేశ్వరరావుతో కలిసి పాల్గొనడం విశేషం.