Minister Puvvada Comments on KTR : 'తెలంగాణ సీఎం కావడానికి కేటీఆర్ రెడీ' - తెలంగాణ న్యూస్
Minister Puvvada Comments on KTR at Panna Pragathi : బీఆర్‌ఎస్‌లో ప్రస్తుత సీఎం.. కాబోయే సీఎం ఇద్దరూ ఉన్నారని మంత్రి అజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గొంగలి పురుగులా ఉన్న ఖమ్మం పట్టణాన్ని సీతాకోక చిలుకలా మార్చిన ఘనత.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకే దక్కుతుందని వివరించారు. ఖమ్మం నగర అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టినట్లు వివరించారు. రూ.80 కోట్లతో కోళ్లపాడు ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తోందని మంత్రి తెలిపారు.
త్వరలోనే ఖమ్మం నగరంలో తీగల వంతెనకు శంకుస్థాపన చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారని పువ్వాడ చెప్పారు. తాను పుట్టింది.. పెరిగింది.. ఖమ్మంలోనే అని.. అందుకే ఆ నగరం అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఖమ్మం నగరానికి తన సేవలు అవసరం లేదనుకున్న రోజు తాను స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని పట్టణ ప్రగతి దినోత్సవంలో భాగంగా ఎస్సార్ ఆండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల గ్రౌండ్స్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు చేపట్టిన ర్యాలీలో మంత్రి అజయ్ పాల్గొన్నారు.