Telangana Martyrs Memorial : అమరుల స్ఫూర్తి నిత్యం జ్వలించేలా.. ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’
Minister Prashanthreddy Interview on Telangana Martyrs Memorial : వందలాది అమరుల త్యాగఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. వారి స్ఫూర్తి నిత్యం మదిలో మెదిలేలా... వీరుల త్యాగం భవిష్యత్ తరాలకు తెలిపేలా... ప్రభుత్వం నిర్మించిందే అమరుల స్మారకం. హైదరాబాద్ నడిబొడ్డున.. సచివాలయానికి ఎదురుగా సుమారు 3.29ఎకరాల్లో నిర్మించిన స్మారకం భాగ్యనగర కీర్తికిరీటంలో మరో కిరికితురాయిగా చేరబోతోంది. అరుదైన కట్టడాల్లో ఒకటిగా రూపొందించిన స్మారకంలో... అమరుల స్ఫూర్తి నిత్యం జ్వలించేలా ప్రత్యేకంగా దీపం ఆకృతిని ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన స్మారకం అమరుల త్యాగాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వివరించారు.
భవన ప్రధానం ద్వారం మొదలు.. పార్కింగ్ వరకు పర్యాటకుల సౌకర్యాలకు అనుగుణంగా వసతులు కల్పించినట్లు వివరించారు. కొవిడ్ కారణంగా నిర్మాణ పనులు ఆసల్యం అయినప్పటికీ డిజైనింగ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ.. స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన వారి కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. అదే సీఎం కేసీఆర్ స్మారాకాన్ని నిర్మించి అమరుల త్యాగ స్ఫూర్తిని చాటుతున్నారని చెబుతున్నారు. పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని... దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం(జూన్ 22) నాడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అమరుల స్మారకం నిర్మాణంలోని మరిన్ని ప్రత్యేకతల్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాటల్లో విందాం.