డిసెంబర్ ఆఖరిలో రైతుబంధు 100 శాతం ఇస్తాం : పొన్నం ప్రభాకర్ - రైతు బంధు పథకం తెలంగాణ 2023
Published : Dec 11, 2023, 1:53 PM IST
Minister Ponnam Prabhakar Clarity on Rythu Bandhu Scheme :రైతుకు పెట్టుబడి 100 శాతం ఇస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వం డిసెంబర్ ఆఖరిలో ఇచ్చేదని, తాము కూడా అలాగే ఇస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రాగానే రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మాజీ మంత్రులు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా గజ్వేల్‌కు వచ్చిన పొన్నం ప్రభాకర్‌కు డీసీసీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గజ్వేల్‌లో మాట్లాడారు.
Ponnam Prabhakar Fires on BRS Leaders :ఈ నెల 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తే, 9న 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను ప్రారంభించామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రవాణా శాఖ పరిధిలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఇచ్చిన ప్రకారం 6 గ్యారంటీలను 100 రోజుల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని నడవనీయమని ప్రతిపక్షాలు అంటున్నారని ధ్వజమెత్తారు.
గతంలో ఇచ్చిన విధంగానే రైతుబంధు ఇస్తామని, కేసీఆర్ గజ్వేల్ నుంచి గెలిచాక ఒక్కసారైనా ఇక్కడి ప్రజలను కలవలేదని మంత్రి పొన్నం మండిపడ్డారు. ప్రగతిభవనాన్ని ప్రజాభవన్‌గా మార్చామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అక్కడ తెలుసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య పాలనను అందిస్తామని, భూ నిర్వాసితులతో కూలంకషంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హమీ ఇచ్చారు. రైతుబంధులోని లోపాలను సవరించి వీలైనంత త్వరలో రైతు బంధు నగదు అందిస్తామని పొన్నం ప్రభాకర్ వివరించారు.