Green Property Show in Hyderabad : హైటెక్స్‌లో గ్రీన్ ప్రాపర్టీ షో.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
KTR Inaugurated green property show : రాష్ట్రంలో హరితహారం కార్యక్రమ ఫలితంగా పచ్చదనం 24 నుంచి 33 శాతానికి పెరిగిందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో ఐజీబీసీ, సీఐఐ, తెలంగాణ సర్కారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన గ్రీన్ ప్రాపర్టీ షోను కేటీఆర్ ప్రారంభించారు. కొత్త నిర్మాణాల్లో పచ్చదనం పెంపునకు అవసరమైన ఉపకరణాలు, పర్యావరణహిత బిల్డింగ్‌ల రూపకల్పనకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. తెలంగాణ పచ్చదనానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత దాదాపు 200 కోట్ల మొక్కలు నాటామన్నారు. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని అనేక కట్టడాలకు గ్రీన్ సర్టిఫికెట్ లభించిందన్న మంత్రి.. పచ్చదనం, భవిష్యత్తు తరాలకు ఇచ్చే అద్భుతమైన కానుక అని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, సీఐఐ, ఐజీబిసి ఛైర్మెన్ శేఖర్ రెడ్డి, యూఏఈ కౌన్సిల్ జనరల్ ఆరిఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సీజీఎం రాజేశ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు సాగనున్న ఈ ప్రదర్శనలో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు చెందిన గ్రీన్ రేటెడ్ ప్రాజెక్టుల ప్రతినిధులు పాల్గొన్నారు.