మల్లేశ్ హత్యను రాజకీయంగా వాడుకోవడం కేటీఆర్ స్థాయికి తగదు : మంత్రి జూపల్లి - minister jupalli latest news
Published : Jan 15, 2024, 3:19 PM IST
|Updated : Jan 15, 2024, 3:59 PM IST
Minister Jupally Fires on KTR : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ జవాన్ మల్లేశ్ హత్యను రాజకీయంగా వాడుకోవడం బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్థాయికి తగదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా తాను హత్యా రాజకీయాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదన్నారు. స్థానిక నాయకులు చెప్పగానే వాస్తవాలు తెలుసుకోకుండా వెళ్లి ఆరోపణలు చేసి, కేటీఆర్ ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. మల్లేశ్ హత్య ఎన్నికలకు ముందే కుటుంబ, భూ తగాదాలతో జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలిందని మంత్రి వివరించారు.
మల్లేశ్ యాదవ్ బీజేపీ సానుభూతిపరుడని, ఎన్నికలకు కేవలం 10 రోజుల ముందే బీఆర్ఎస్‌లో చేరారని మంత్రి తెలిపారు. మల్లేశ్ హత్యను రాజకీయంగా వాడుకునే విధంగా దిగజారొద్దని హితవు పలికారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే ఉండాలి కానీ, ప్రతి విషయంలోనూ చేయడం తగదన్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక తప్పుడు కేసులు పెట్టారని, ఆధారాలతో సహా పోలీసులతో పాటు ప్రగతిభవన్ ప్రముఖులకు పంపించినా ఆనాడు ఎవరూ స్పందించలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొండగట్టు వద్ద ప్రమాదంలో 60 మంది చనిపోయినా, న్యాయవాది వామన్‌రావు దంపతులు నడిరోడ్డుపై హత్యకు గురైనా వెళ్లని కేటీఆర్, మల్లేశ్ ఇంటికి వెళ్లడం రాజకీయం కాదా అని ప్రశ్నించారు.
అసలు ఏం జరిగిందంటే?నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లికి చెందిన మల్లేశ్ ఇటీవల హత్యకు గురయ్యారు. బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లతో కలిసి కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. మృతుడి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి, బీఆర్‌ఎస్ పార్టీ తరపున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో హత్యా రాజకీయాలు మంచివి కాదని, కార్యకర్తలపై దాడులు చేయడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు. కింది స్థాయి కార్యకర్తలను సమిధలను చేయడం భావ్యం కాదన్నారు. మల్లేశ్ హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డీజీపీ, ఎస్పీని కోరారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి జూపల్లి స్పందించారు.