Harishrao Fires On Governor : 'గవర్నర్ వ్యాఖ్యల్లో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది' - గవర్నర్ తమిళిసై తాజా వార్తలు
Minister Harishrao Fires On Governor Tamilisai :ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ వ్యాఖ్యలను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. గవర్నర్ తమిళిసై బీజేపీ ప్రతినిధిలా మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేపడుతున్న ఒక్కసారి మొచ్చుకొని గవర్నర్.. ప్రభుత్వంపై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించాలని సర్కారు భావించినప్పటికీ.. కొందరు కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. వైద్య రంగానికి సంబంధించి కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నామన్న మంత్రి.. తమ పాలనలో చెడు మాత్రమే గవర్నర్ చూస్తారా? మాట్లాడతారా? అని ప్రశ్నించారు. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యల్లో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కంటి వెలుగులాంటి కార్యక్రమాన్ని మెచ్చుకునేందుకు గవర్నర్‌కి మనసురాలేదని ఆరోపించారు. నిమ్స్‌లో బెడ్స్ పెంపుపై ఆమె ఒక్క ట్వీట్ కూడా ఎందుకు చేయలేదు? అని నిలదీశారు. మాతా శిశుమరణాలు తగ్గించడంలో రాష్ట్రం అగ్రభాగాన ఉందని నీతి ఆయోగ్ చెబితే గవర్నర్‌కు అది కనిపించలేదంటూ విమర్శించారు. మంచి కనబడదు.. వినబడదు అనేరీతిలో తమిళిసై వ్యవహారశైలి ఉందని మంత్రి మండిపడ్డారు. రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై.. బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడడం దురదృష్టకరమని హరీశ్‌రావు ఆరోపించారు.