'భూమి కొరత వల్ల ఎస్సీలకు మూడెకరాలు ఇవ్వలేకపోయాం' - ఎంఆర్పీఎస్ సభలో పాల్గొన్న హరీశ్‌రావు
Published : Nov 5, 2023, 10:21 PM IST
Minister Harish Rao in Hyderabad MRPS Sabha :ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి రానున్న ప్రధాని నరేంద్రమోదీ ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఎంఆర్పీఎస్ సభలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో బిల్లు పాస్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యున్నత శాసనసభ రెండుసార్లు తీర్మానం చేసినా.. తొమ్మిదిన్నరేళ్లుగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోకుండా ఉందని హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్రానికి లేని ఇబ్బంది కేంద్రానికి ఏంటని ప్రశ్నించారు. భవిష్యత్‌లో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్కు క్రియాశీలక పాత్ర అవకాశం వచ్చినప్పుడు.. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Harish Rao MRPS Meeting at Indira Park : ఎస్సీ వర్గీకరణ ఆత్మగౌరవ పోరాటానికి ఉద్యమం సమయంలోనే కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని తొలి శాసనసభలోనే ఏకగ్రీవ తీర్మానం చేయడంతో.. కేంద్రాన్ని మరోసారి కోరుతూ రెండోసారి కూడా తీర్మానం చేసి పంపి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకుందన్నారు. భూమి కొరత వల్ల ఎస్సీలకు మూడెకరాలు ఇవ్వలేక పోయామని.. అందుకే సాహసోపేతమైన దళితబంధును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 33 ఎస్సీ స్టడీ సర్కిళ్లు, గురుకులాలు ఏర్పాటు చేసినట్లు హరీశ్‌రావు వివరించారు.