Errabelli Fires on Congress : ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే పార్టీనే గెలిపించాలి : ఎర్రబెల్లి - వరంగల్లో అభివృద్ధి పనులకు ఎర్రబెల్లి శంకుస్థాపన
Published : Oct 9, 2023, 4:54 PM IST
Minister Errabelli Fires on Congress : గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉన్నవారే నిజమైన నాయకులని అలాంటి వారికే పట్టం కట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలను కోరారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో రూ.14 కోట్ల నిధులతో చేపట్టిన వంద పడకల ప్రభుత్వాసుపత్రి, నూతన మున్సిపాలిటీ భవనం, అంబేద్కర్ విగ్రహం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనా నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల లోపే ఈ కార్యక్రమాలను హడావిడిగా నిర్వహించగా.. అధికారులు, ప్రజాప్రతినిధులు ఉరుకులు పరుగులు తీశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోనే కాంగ్రెస్ అంత చెత్త పార్టీ మరొకటి లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల హడావిడి ఉంటుందని.. ప్రజలు వివేకంగా ఆలోచించి అభివృద్ధి చేసిన పార్టీని, నాయకులను గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.