'కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాములవారిని ప్రార్థించాం'
Published : Dec 10, 2023, 10:26 PM IST
Minister Bhatti Visited Bhadrachalam Temple :రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనలో సంపద సృష్టిస్తామని వచ్చిన సంపదను ప్రజలకు పంపిణీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు దర్శించుకున్నారు. దేవాలయం వద్దకు వచ్చిన మంత్రులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాలతో పూలమాలలతో స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు శాలువాలతో సత్కరించి మంత్రులకు పట్టు వస్త్రాలు, స్వామి వారి ప్రతిమ ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమైపోయిందని ప్రజా పాలన వచ్చిందని అన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగాలని ఆ సీతారాములను కోరుకున్నట్లు మంత్రులు తెలిపారు. మతసామరస్యాలకు భద్రాచల శ్రీ సీతారాములు పేరు ఉందని అందుకే ముస్లిం రాజు సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు అందించే సాంప్రదాయం భద్రాచలంలో ఉందని అన్నారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలనే కొనసాగుతుందని మంత్రులు తెలిపారు.