MIM Meeting in Zahirabad : మామను గెలిపించండి.. పవర్ ప్లేలో మా తడాఖా చూపిస్తాం : అసదుద్దీన్ ఓవైసీ
Published : Oct 28, 2023, 5:14 PM IST
MIM Meeting in Zahirabad : తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన హోంమంత్రి అమిత్ షాకు బీసీలపై ప్రేమ ఉంటే దేశంలో బీసీ కుల గణన ఎందుకు చేపట్టలేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిర్వహించిన ఎంఐఎం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. బీజేపీ, కాంగ్రెస్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కవల సోదరుల్లాంటి కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని.. వారికి బాయ్.. బాయ్ చెప్పే సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. లోక్ సభ సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టిన మోదీ సర్కార్.. ఓబీసీ, ముస్లిం మహిళలకు ఎందుకు రిజర్వేషన్ కల్పించలేదని నిలదీశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ 30న కేసీఆర్‌కు మద్దతుగా ఓటు వేయాలని కోరారు.
మతతత్వ బీజేపీ, ఆర్ఎస్ఎస్.. తల్లి లాంటి కాంగ్రెస్‌ను ఓడించేందుకు మామ(కేసీఆర్)ను గెలిపించాలని అన్నారు. మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో మారు ఆశీర్వదించాలని.. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే జహీరాబాద్‌కు కేసీఆర్‌ను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు బీజేపీలో ఉన్న నాయకుడు వికారాబాద్ నుంచి జహీరాబాద్‌కు వచ్చి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారని.. మళ్లీ వికారాబాద్‌కు వెళ్లిపోవడం ఖాయమన్నారు. ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని.. రాష్ట్రంలో త్రిముఖ పోరులో ఎంఐఎం నాలుగో ప్లేయర్‌గా పవర్ ప్లేలో తడాఖా చూపుతుందని స్పష్టం చేశారు.