BRS and MIM Clash in Nizamabad : పట్టణ ప్రగతి కార్యక్రమంలో బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఘర్షణ - నిజామాబాద్‌లోని బోధన్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమం
BRS and MIM clash in Nizamabad : రాష్ట్రంలో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి మిత్ర పక్షాలనే విషయం అందరికీ తెలిసిందే. కానీ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ కౌన్సిలర్లు గందరగోళం సృష్టించారు. ఫలితంగా కార్యక్రమంలో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఎంఐఎం కౌన్సిలర్లు, నాయకులు పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆర్డీవో రాజేశ్వర్‌ను నిలదీశారు. పట్టణ ప్రగతి అంటే పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.. కానీ ఇక్కడ అదీ కూడా జరగలేదని ఎంఐఎం కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు సభాస్థలి నుంచి ఎంఐఎం నాయకులను అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. అక్కడి నుంచి కార్యకర్తలు వెళ్లిపోయారు. స్థానిక ఎమ్మెల్యే షకీల్ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం.. రూరల్‌లో పాల్గొనడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.