Margadarshi మార్గదర్శి కేసులో పోలీసులకు చుక్కెదురు.. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఆదేశాలు - AP Latest News
Margadarshi Chit Fund: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేటు లిమిటెడ్‌పై విజయవాడ కృష్ణలంక పోలీసులు నమోదు చేసిన కేసులో వారికి చుక్కెదురైంది. రిమాండ్ పిటిషన్‌ను విజయవాడ రెండో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. లబ్బిపేట బ్రాంచి చీఫ్ మేనేజరు బండారు శ్రీనివాసరావు, పోర్‌మెన్ మౌళిప్రసాద్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. అవసరమనుకుంటే తదుపరి విచారణ కోసం 41-A నోటీసు ఇచ్చి స్టేషన్‌కు పిలిపించుకోవాలని స్పష్టం చేశారు. మార్గదర్శి సంస్థ విశ్వసనీయతను దెబ్బతీయడం కోసమే ఈ తరహా కేసులు నమోదు చేశారని సీనియర్ న్యాయవాది సుంకరి రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు.
ఫిర్యాదుదారు చిట్ పాడుకున్న మర్నాడే ష్యూరిటీ దరఖాస్తుతో పాటు సమాచార పత్రాన్ని కూడా మార్గదర్శి సంస్థ పోస్టులో పంపించిందని తెలిపారు. అతను ఆ ష్యూరిటీ దరఖాస్తు తిరిగి పంపలేదని మళ్లీ మార్గదర్శి సంస్థ రిమైండర్ పంపినా.. స్పందన లేఖపోవడంతో మరోసారి అతనికి పోస్టు ద్వారా దరఖాస్తు పంపించారని న్యాయస్థానంలో సుంకరి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తన ఇంటిని ష్యూరిటీగా చూపిస్తున్నట్లు పేర్కొంటూ ఫిర్యాదుదారు మార్గదర్శి మేనేజరుకు లేఖ సమర్పించారని, అయితే ఆ ఆస్తి కుదవ పెట్టి ఉందని.. వేరు ఆస్తిపత్రాలు సమర్పించాలని కోరగా అవీ సమర్పించలేదని న్యాయవాది రాజేంద్రప్రసాద్ తెలిపారు. సరైన ఆస్తి పత్రాలు ఇవ్వనందు.. చట్టప్రకారం ఫిర్యాదుదారు పాడుకున్న చిట్ మొత్తాన్ని మార్గదర్శి రెండో ఖాతాలోకి పంపించిందని తెలిపారు. నిబంధనల ప్రకారం మార్గదర్శి వ్యవహరించినా.. పోలీసులు మాత్రం కక్షసాధింపుతో కేసు రాజేంద్రప్రసాద్ పెట్టారన్నారు.