పోలీస్స్టేషన్లో 8 నాగుపాములు.. బుసలు కొడుతూ బయటకు వచ్చి..! - బిహార్ వార్తలు
ఒక్క పామును చూస్తేనే మనం భయపడిపోతాం... అలాంటిది డజన్లు కొద్దీ పాములు కనిపిస్తే ఇంకేముంది పరుగులే!.. బిహార్లోని ఓ పోలీస్ స్టేషన్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తరచుగా సర్పం కనిపించటం వల్ల పాముల పట్టే వారిని పోలీసులు పిలిపించారు. ఆ సమయంలో ఏకంగా ఎనిమిది నాగు పాములు ఒక్కసారిగా బయటకు రావడం వల్ల పోలీసులు షాక్ అయ్యారు.
జెహనాబాద్ పోలీసు స్టేషన్లో వరుసగా రెండు మూడు రోజుల నుంచి పాములు కనిపిస్తున్నాయి. రోజూ పాములు కనిపించటం వల్ల భయంగానే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. తరుచుగా పాముల కనిపిస్తున్నాయని ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో శనివారం పాముల పట్టే వారిని పిలిపించారు. ముందు ఒక పామే ఉంటుందని అంతా అనుకున్నారు. తరువాత వరుసగా మొత్తం ఎనిమిది నాగుపాములు బయటకు రావటం వల్ల అందరూ ఒక్కసారిగా భయపడ్డారు.
"అన్ని పాములను చూసి నేను ఆశ్చర్యపోయాను. పోలీసులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందుకు సంతోషంగా ఉంది. స్టేషన్ ఆవరణ శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ ఒక్కసారిగా అన్ని పాములు బయటకు రావటం వల్ల షాక్ అయ్యాను" అని ఎస్పీ దీపక్ రంజన్ తెలిపారు.