Food Poisoning in Asifabad District : సంతలో మిర్చీ బజ్జీలు తిని 60 మందికి పైగా అస్వస్థత - Many people are sick after eating Bondas in Santa
Food Poisoning in Asifabad District : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన సంతలో మిరపకాయ బజ్జీలు, బోండాలు తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల కథనం ప్రకారం.. తిర్యానీ మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం పెద్ద సంత జరుగుతుంది. అక్కడకి తాండూర్ ఐబీ నుంచి వచ్చే ఓ వ్యక్తి మిరప, ఉల్లి బజ్జీలు అమ్ముతుంటాడు. ఎప్పటిలానే సంతలో కొందరు అతని వద్ద ఆ బజ్జీలు తినగా.. రాత్రి అయ్యే సరికి వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. కుటుంబసభ్యులు బాధితులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు 60 మంది వరకు ఆసుపత్రి పాలు కాగా.. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్ హర్ష తెలిపారు. కలుషిత ఆహారం తినడం వల్లే అస్వస్థతకు గురైనట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని.. ప్రజలు బయట తినే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.