మణిపుర్ అమానుష ఘటనపై కుకీల భారీ ర్యాలీ.. న్యాయం కోసం డిమాండ్ - మణిపుర్ ఆందోళనలు
Manipur Woman Paraded Incident : మణిపుర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి ఊరేగించి.. అనంతరం అత్యాచారం చేశారన్న ఆరోపణలపై అక్కడి కుకీలు భగ్గుమన్నారు. మే 4న జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అమానుష ఘటనపై.. భారీగా ఆందోళలు చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గురువారం చురచంద్‌పుర్ జిల్లాలో భారీ ర్యాలీ తీసి నిరసనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన వేళ.. మణిపుర్ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ దారుణంపై కిడ్నాప్, అత్యాచారం, హత్యాయత్నం కేసు నమోదు చేసి.. వైరలైన వీడియోల ఆధారంగా ఒక నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతడ్ని హురేమ్ హెరోదాస్ సింగ్ (32)గా గుర్తించారు. మహిళలపై దారుణంగా వ్యవహరించిన ఈ ఘటనపై.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఘాటుగా స్పందించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఘటనకు పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తెలిపారు. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఘటనను సుమోటోగా స్వీకరించింది.