Manipur Violence : కేంద్ర సహాయ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులు.. ఇళ్లంతా ధ్వంసం! - ఆర్కే రంజన్ ఇంటికి నిప్పు
Manipur Violence : మణిపుర్లో హింస కొనసాగుతోంది. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి.. పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ దాడిలో మంత్రి నివాసంలోని కింది, మొదటి అంతస్తు బాగా దెబ్బతిన్నాయి. అంతేగాక.. రంజన్ సింగ్ ఇంటి కింద ఉన్న పార్కింగ్ ప్రదేశంలోని పలు వాహనాలు దగ్ధమయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దుండగుల దాడి సమయంలో మంత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనలో దుండగులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
'గురువారం రాత్రి నా ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. నా నివాసం కింది, మొదట అంతస్తు తీవ్రంగా దెబ్బతింది. ఇలాంటి ఘటనలతో సాధించేదేమి లేదు. మణిపుర్ ప్రజలు శాంతియుతంగా ఉండాలి. హింస వల్ల ఏమీ సాధించలేం. హింసకు పాల్పడినవారు మానవత్వానికి శత్రువులు.' అని మంత్రి రంజన్ సింగ్ తెలిపారు.