ఎమ్మార్పీఎస్ ప్రచారంతోనే బీజేపీకి 8 సీట్లు వచ్చాయి : మందకృష్ణ మాదిగ - బీజేపీకి మద్దతుగా మంద కృష్ణ మాదిగ
Published : Dec 5, 2023, 5:32 PM IST
Manda Krishna Madiga on Telangana Election Results : కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడంతో నియంతృత్వం, అహంకారం, కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోవడంతో తెలంగాణలో ప్రజాస్వామ్యం ఊపిరి పోసుకుందన్నారు. సికింద్రాబాద్, పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2023 ఎన్నికల్లో ప్రధాన పార్టీల గెలుపు, ఓటమిలను గురించి విశ్లేషించారు. బీజేపీకి ఎమ్మార్పీఎస్ ప్రచారం చేయడంతోనూ 7 శాతం ఓటు పెరిగి 8 స్థానాల్లో గెలుపొందిందన్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారని ఆయన పేర్కొన్నారు. దానికి కారణంగా లిక్కర్ స్కాంలో అందరూ అరెస్ట్ అయినా, కవితను అరెస్ట్ చేయకపోవడం అదే సమయంలో బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ప్రజలు రెండు పార్టీలు ఒకటే అని నమ్మినట్లు ఆయన వివరించారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాన మోదీ సానుకూలంగా స్పందించడంతోనే బీజేపీ పార్టీ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. మాదిగల అస్థిత్వం దృష్ట్యా బీజేపీలోనే న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు స్థానం లేదని, ఆ పార్టీ మాదిగలను అణచివేసేందుకు ప్రయత్నం చేసిందని ఆరోపించారు. మాదిగ భవిష్యత్ కోసం బీజేపీతోనే మా ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
TAGGED:
మంద కృష్ణ మాదిగ తాజా వార్తలు