Man wears Nighty to theft Cell phones : నైటీలో వచ్చి మొబైల్ షాపులో చోరీ.. కానీ చివరకు - సెల్ఫోన్లు దొంగతనం చేసిన సెక్యూరిటీ గార్డ్
Cell Phones Theft in Secunderabad : సికింద్రాబాద్‌లో అమ్మాయి వేషధారణలో ఓ సెక్యూరిటీ గార్డ్ చేసిన దొంగతనం అందరినీ విస్మయానికి గురి చేసింది. గుర్తుపట్టకుండా ఉండేందుకు అమ్మాయిలు వేసుకునే రాత్రి దుస్తులు ధరించి అర్ధరాత్రి తాను పనిచేసే దుకాణానికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. దొంగతనం జరిగిన తర్వాత సెలవుపై స్వగ్రామానికి వెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమ కోణంలో విచారణ చేయగా నిజాన్ని ఒప్పుకున్నాడు. ఈ ఘటనలో పోలీసులు సెక్యూరిటీ గార్డ్ యాకయ్య నుంచి రూ.8 లక్షల విలువైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్డీ రహదారిలో ఉన్న మొబైల్ దుకాణంలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న యాకయ్య అనే వ్యక్తి అర్ధరాత్రి అమ్మాయి వేషధారణలో సెల్ఫోన్లను తస్కరించినట్లు మహంకాళి ఏసీపీ రమేశ్ తెలిపారు. దుకాణంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని ఆసరాగా తీసుకున్న యాకయ్య అర్ధరాత్రి గుర్తుపట్టకుండా ఉండేందుకు అమ్మాయిలు రాత్రి వేసుకునే దుస్తులు ధరించి దుకాణంలోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు దొంగతనం చేసిన వెంటనే మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో తన స్వగ్రామానికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానం వచ్చిన పోలీసులు.. యాకయ్యను విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు డబ్బుల కోసం దొంగతనానికి పాల్పడాల్సి వచ్చిందని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.