Man Washed Away In Waterfall : చూస్తుండగానే జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు.. లైవ్ వీడియో - హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల జలపాతంలో విషాదం
Published : Sep 17, 2023, 8:06 PM IST
Man Washed Away In Waterfall Live Video : విహారయాత్ర కోసం వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఒకరు జలపాతంలో కొట్టుకుపోయారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్డా జిల్లాలో జరిగింది. ధర్మశాల నగరంలోని భాగ్సునాగ్ జలపాతానికి విహారయాత్ర కోసం పంజాబ్ జలంధర్‌కు చెందిన నలుగురు స్నేహితులు వెళ్లారు. ఈ క్రమంలోనే జలపాతంలో కాసేపు సరదాగా గడిపేందుకు నీటిలోపలికి దిగారు. ఈ సమయంలోనే జలపాతం పైనుంచి ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరగడం వల్ల నలుగురు నీటిలో చిక్కుకుపోయారు. ఈ సమయంలో జలపాతాన్ని చూసేందుకు వచ్చిన కొందరు సందర్శకులు, స్థానికులు వారిని గమనించి బయటకు రావాల్సిందిగా కేకలు వేశారు. దీంతో వారు ఒక్కొక్కరిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కాపాడుకోగా.. మరో మిత్రుడు 32 ఏళ్ల పవన్ కుమార్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన యువకుడి మృతదేహాన్ని జలపాతానికి 200 మీటర్ల దిగువన వెలికితీసి స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని కాంగ్డా ఏఎస్పీ వీర్ బహదూర్ తెలిపారు. అయితే జలాశయం నీటి ప్రవాహం ఉవ్వెత్తున పెరగడానికి ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు కారణమని ఆయన చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.