Man Suicide Attempt with Petrol : ఒంటిపై పెట్రోల్ పోసుకొని వ్యక్తి నిరసన.. - ఎంపీడీఏ ఆఫీసులో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వ్యక్తి
Suicide Attempt In MPDO office : ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో కలకలం సృష్టించింది. కార్యాలయ సిబ్బంది బాధితుడిని అడ్డుకుని బాటిల్‌ను లాక్కున్నారు. లేకపోతే ఒక ప్రాణం బలైపోయేది. చిన్నగూడూరు గ్రామానికి చెందిన వడ్లకొండ ఆదామ్ అనే వ్యక్తి మహబూబాబాద్ రహదారిలో స్థానిక ప్రభుత్వ పాఠశాల గోడను ఆనుకుని చికెన్ దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చికెన్ షాపుని జీవనాధారంగా ఎంచుకొని కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు.
ఈ క్రమంలో చికెన్ షాపును తొలగించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారని తెలిపాడు. తన పక్కన ఉన్న మిగతా దుకాణాలను విస్మరించి కేవలం తన ఒక్క షాపునే ఎందుకు తొలగిస్తున్నారంటూ.. నోటీసు ఇవ్వడాన్ని నిరసిస్తూ మండల పరిషత్ కార్యాలయానికి పెట్రోల్ సీసాతో వెళ్లాడు. సమస్యను ఎంపీడీవో శ్యాంసుందర్ దృష్టికి తీసుకెళ్లి తనను గత కొంత కాలంగా బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తనకు న్యాయం చేయాలంటూ పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కార్యాలయ సిబ్బంది, స్థానికులు అడ్డుకొని పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. అనంతరం బాధితుడు కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీడీవో కార్యాలయం ముందు న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు.