అసెంబ్లీ ఎన్నికల టికెట్ దక్కలేదని శ్మశానంలో నిరసన - చేరుకు రైతు పాదయాత్ర చేపట్టిన దిల్లీ వసంత్
Published : Nov 3, 2023, 7:20 PM IST
Man Sleep at Tomb for BJP MLA Ticket: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఆశించినా దక్కకపోవడంతో.. ఓ వ్యక్తి వినూత్నంగా శ్మశానంలో నిద్రించి నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన చెరుకు రైతు ఉద్యమ నేత దిల్లీ వసంత్.. ఝరాసంగం మండలం ఎల్గొయిలో ఆత్మహత్య చేసుకున్న రైతు చాకలి దశరథ్ సమాధి పక్కన నిద్రించి నిరసన చేశారు. ఇటీవల ఆయన ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గం నుంచి మొదట బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించిన దక్కలేదు. తర్వాత బీజేపీలో చేరి టికెట్ కోసం దిల్లీ వరకు వెళ్లి తీవ్ర ప్రయత్నాలు చేశారు.
గురువారం బీజేపీ ప్రకటించిన జాబితాలో దిల్లీ వసంత్ పేరు లేకపోవడంతో నేరుగా దిల్లీ నుంచి జహీరాబాద్ చేరుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ క్రమంలో రైతు ఆత్మహత్యకు నిరసనగా చెరుకు రైతు పాదయాత్రను చేపట్టారు. అనంతరం ఎల్గొయిలో ఆత్మహత్య చేసుకున్న చెరుకు రైతు చాకలి దశరథ్ సమాధి వద్ద నిరసన వ్యక్తం చేశారు. టికెట్ దక్కకపోయినా బీజేపీలోనే కొనసాగి రాష్ట్రంలో రైతు సమస్యలపై నిరసనగళాన్ని వినిపిస్తానని వసంత్ చెప్పారు.