మద్యం మత్తులో ఓ వ్యక్తిని ఢీకొన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ - పాదచారుడు మృతి - ఎస్ఆర్‌నగర్ కానిస్టేబుల్
Published : Jan 1, 2024, 8:34 PM IST
|Updated : Jan 1, 2024, 9:36 PM IST
Man Died after Constable Vehicle Hit at Hyderabad : బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మద్యం మత్తులో వేగంగా ద్విచక్రవాహనం నడుపుతూ వెనక నుంచి ఢీ కొట్టాడు. దీంతో దుర్గయ్య(58) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. బాలానగర్‌లో నివసించే కందుకూరి దుర్గయ్య అనే వ్యక్తి అమీర్‌పేట్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో పని చేస్తూ ఉండేవాడు.
Constable Rush Drive at Balanagar : ఎప్పటిలాగానే తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో బాలానగర్‌లోని మెజిస్టిక్ గార్డెన్ వద్ద, ఎస్ఆర్‌నగర్ పీఎస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లికార్జున్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ దుర్గయ్యను ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే కానిస్టేబుల్ తన బైక్‌ను వదిలి పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.