Snake In House : పామును పట్టి జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో విడిచిపెట్టాడు.. అసలు విషయం తెలిస్తే షాకే! - పాము
Snake In House At Hyderabad : గత వారం రోజులుగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు రోడ్లు, కాలనీలు నీట మునుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నాలాల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వరద నీటితో పాటు మురుగు నీరు ఇళ్లల్లోకి చేరుతోంది. మురుగు నీటితో పాటు క్రిమీకీటకాలు, పాములు కూడా ఇళ్లల్లోకి వస్తుండటంతో.. నగరవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా సికింద్రాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో సంపత్ అనే వ్యక్తి ఇంట్లోకి మురుగు నీరుతో పాటు పాము రావడంతో కుటుంబ సభ్యులు భయపడ్డారు.
ఈ విషయంపై జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సంపత్ సమాచారం ఇచ్చాడు. ఫోన్ చేసి ఆరు గంటలు గడుస్తున్నా అధికారులు రాకపోవడంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన సంపత్ పామును డబ్బాలో బంధించాడు. ఆ తర్వాత ఓపిక నశించి.. నేరుగా జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఓ అధికారి టేబుల్‌పై పామును వదిలి వారి నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పించాడు. ఈ వ్యవహారం కాస్తా బయటకు పొక్కడంతో జీహెచ్‌ఎంసీ తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయంత్రం వరకు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో.. సాయం కోసం 9000113667 నెంబర్‌కు సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ నగరవాసులకు విజ్ఞప్తి చేసింది.