'ఆ ఎస్సై నా వద్ద డబ్బులు తీసుకుని.. తిరిగివ్వమంటే వేధింపులకు గురిచేస్తున్నాడు' - నిజామాబాద్లో వ్యక్తి ఆత్మహత్యా యత్నం
Selfie Suicide Attempt: సెల్ఫీ వీడియో తీసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని న్యాల్కల్ సమీపంలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన క్రాంతి అనే వ్యక్తి.. గాయత్రీ నగర్లో నివాసం ఉంటున్నాడు. అతని వద్ద నుంచి రూ.7 లక్షల నగదు, మూడున్నర తులాల బంగారం తీసుకొని.. ఎస్సై బాబురావు తనను నెల రోజులుగా వేధిస్తున్నాడంటూ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగాడు. ఎస్సై వేధింపులు తాళలేకే.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని అడిగితే.. ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని కన్నీరు పెట్టుకున్నాడు. భార్యాభర్తల మధ్య వివాదాలు సృష్టించి.. తన భార్యను పుట్టింటికి వెళ్లిపోయేలా చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే.. మళ్లీ వేధింపులు ఎక్కువయ్యాయని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. పురుగుల మందు తాగాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు డయల్ 100కు ఫోన్ చేయగా.. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రాంతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.