భూవివాదంలో ఎస్సై కొట్టడంతో వ్యక్తి మృతి! సస్పెండ్ చేసిన ఐజీ - Nalgonda Crime News
Published : Dec 11, 2023, 4:49 PM IST
Man Allegedly Beaten to Death by Police in Nalgonda : నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి పోలీస్ స్టేషన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అన్నదమ్ముల భూ వివాదంలో ఎస్సై జోక్యం చేసుకోవటంతో వివాదం చావు వరకు వెళ్లింది. భూ పంచాయతీలో ఓ వ్యక్తిని ఎస్సై కొట్టడంతోనే, బాధితుడు చనిపోయాడనే ఆరోపణలతో ఎస్సై సతీశ్ రెడ్డిపై ఐజీ సస్పెండ్ వేటు వేశారు. అతడిని అధికారులు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం, చింతపల్లి మండలం పాలెం తండాకు చెందిన నేనావత్ సూర్య(55)కు తన తమ్ముడికి కలిపి రెండు ఎకరాల భూమి ఉండగా, దానిపై అన్నదమ్ముల మధ్య గత ఏడాది కాలంగా వివాదం నడుస్తోంది.
కొద్దిరోజులు క్రితం ఇరువురు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. భూ వివాదంలో తలదూర్చిన ఎస్సై, ఇరువురిని పిలిపించారని, ఆ సందర్భంలో ఎస్సై సూర్యను కొట్టడంతో ఒక్కసారిగా పడిపోయాడు. వెంటనే బంధువులు అతన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సూర్య మృతికి పోలీసులే కారణం అంటూ మృతుని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, మృతుని కుటుంబికులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సూర్య మృతికి ఎస్సై సతీష్ రెడ్డి కారణమని బంధువుల ఆరోపణలతో, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఆరోపణలను నిర్ధారించి ఎస్సైను సస్పెండ్ చేసి, హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.