Mallu Ravi Fires On Telangana Government : 'రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న స్వేచ్ఛ కాంగ్రెస్‌తోనే సాధ్యం' - తెలంగాణ కాంగ్రెస్
Published : Sep 29, 2023, 7:53 PM IST
Congress Leader Mallu Ravi Fires On Telangana Government :తెలంగాణ ప్రజలు.. బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో పడేయాలని నిర్ణయించుకున్నట్లు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ(Telangana Congress Party) కాదన్న ఆయన.. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలు సాధ్యమయ్యేవేనని స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీనే కానీ.. తమ పార్టీ కాదని మండిపడ్డారు. గాంధీభవన్లో మాట్లాడిన మల్లు రవి.. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt)పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ ప్రభుత్వం.. ఆ హామీలు ఏమి చేసిందని నిలదీశారు. గ్రూప్-1 ఎగ్జామ్ సరిగ్గా జరిపించలేని చేతగాని ప్రభుత్వమని ఆరోపించారు.
Mallu Ravi Comments On BRS Government :తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న స్వేచ్ఛ కాంగ్రెస్‌తోనే సాధ్యమని మల్లు రవి వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వాళ్లు రహదారులు, పరిశ్రమలు ఏర్పాటు చేశారన్న ఆయన.. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని అందుకే తిరుగుబాటు మొదలైందని అన్నారు. తెలంగాణలో పోలీసులు చట్ట ప్రకారం కాకుండా పొలిటికల్ కమాండింగ్‌లో పని చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల్లో గుణాత్మకమైన మార్పుకు సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలు స్వేచ్ఛగా ఉంటారని మల్లు రవి వ్యాఖ్యానించారు.